Kavitha: బీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చినా చేదు జ్ఞాపకాలే మిగిలాయి: కవిత

Kavitha Bitter Experiences with BRS Rule
  • తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత
  • బడ్జెట్ లో ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్
  • త్వరలోనే కొత్త రాజకీయా పార్టీ పెడతామని వెల్లడి

కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని భావించామని... కానీ రాష్ట్రం వచ్చాక తీరని అన్యాయం జరిగిందని కేసీఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.


బాగ్ లింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత మాట్లాడుతూ... ఉద్యమ సోయి లేని రేవంత్ రెడ్డి సీఎం కావడం తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాబోయే బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చినా చేదు జ్ఞాపకాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. 


ప్రొఫెసర్ కోదండరామ్, ఆకునూరి మురళి వంటివారు రేవంత్‌తో కలవడంతోనే తాము కాంగ్రెస్‌ను నమ్మామని... కానీ రెండున్నరేళ్లుగా ప్రొఫెసర్ కోదండరామ్‌ మాట్లాడటం లేదని కవిత విమర్శించారు. బడ్జెట్ లో హామీలకు సంబంధించిన నిర్ణయాలు లేకపోతే కోదండరామ్ ను ప్రశ్నిస్తామని హెచ్చరించారు. 


త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతామని కవిత ప్రకటించారు. అది పక్కా రాజకీయ పార్టీ కాదని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అని స్పష్టం చేశారు. సహనశీలత లేకపోవడం, అహంకారం కారణంగానే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని, మంచితనం, భోళాతనం తెలంగాణ తత్వమని చెప్పారు. అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్టేనని అన్నారు.


ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల వైపే ధర్మం ఉందని, వారి కోసం పోరాటం చేస్తామని కవిత ప్రకటించారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జయశంకర్ సార్ విగ్రహం కేబీఆర్ పార్క్‌లో లేదా ట్యాంక్ బండ్‌పై పెట్టాలని అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిని ఎన్నోసార్లు అభ్యర్థించినా సాధ్యం కాలేదని అన్నారు.

Kavitha
Kalvakuntla Kavitha
BRS
Telangana
Revanth Reddy
Telangana Jagruthi
KCR
Kodandaram
Telangana Politics

More Telugu News