స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన టీచర్ పై దాడి

  • కత్తితో పొడిచి నగలు ఎత్తుకెళ్లిన ఆటోడ్రైవర్
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం
  • ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన ఉపాధ్యాయురాలు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై సదరు ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగల కోసం ఈ దారుణానికి తెగబడ్డాడు. రక్తమోడుతున్న ఉపాధ్యాయురాలిని రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. గూడూరు రూరల్‌ మండలం కందలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనదారులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే..

గూడూరుకు చెందిన హరిత (35) ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. బాలాయపల్లి మండలం గొట్టిగాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. గూడూరు నుంచి నిత్యం స్కూలుకు వెళ్లి వస్తుంటారు. ఈ రోజు ఉదయం స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై కన్నేసిన ఆటో డ్రైవర్.. నిర్మానుష్య ప్రాంతంలో ఆటోను ఆపి కత్తితో హరితపై దాడి చేశాడు.

ఆపై నగలను దోచుకుని కత్తిపోట్లతో రక్తమోడుతున్న హరితను రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు హరితను గమనించి ఆసుపత్రికి తరలించారు. వాహనదారుల సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు.. ఆటోడ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మెరుగైన వైద్యం కోసం హరితను నెల్లూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News