6జీ... వరల్డ్ లీడర్స్ మనమే!: జ్యోతిరాదిత్య సింథియా

  • 22 నెలల్లోనే 99.9% జిల్లాలకు విస్తరించిన 5జీ సేవలు
  • దశాబ్ద కాలంలో 6 కోట్ల నుంచి 100 కోట్లకు పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు
  • నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్‌లో 45వ ర్యాంకుకు మెరుగుపడిన భారత్
4జీ టెక్నాలజీ విషయంలో ప్రపంచాన్ని అనుసరించిన భారత్, 5జీలో ప్రపంచంతో కలిసి నడిచిందని, ఇక 6జీలో ప్రపంచానికే నాయకత్వం వహిస్తుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ధీమా వ్యక్తం చేశారు. బుధవారం లోక్‌సభలో ప్రశ్నలకు సమాధానమిస్తూ, దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రంగం, భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరించారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని సింథియా తెలిపారు. కేవలం 22 నెలల వ్యవధిలోనే దేశంలోని 99.9 శాతం జిల్లాల్లో 5జీ సేవలను ప్రారంభించి ప్రపంచ రికార్డు సృష్టించామన్నారు. ఈ విస్తరణ కోసం టెలికాం సేవల సంస్థలు సుమారు రూ.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాయని, దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు (బీటీఎస్) ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 40 కోట్ల మంది 5జీ సేవలు పొందుతుండగా, 2030 నాటికి ఈ సంఖ్య 100 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.

గత పదేళ్లలో దేశంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య 6 కోట్ల నుంచి 100 కోట్లకు చేరిందని సింథియా తెలిపారు. గ్రామీణ భారతంలో వై-ఫై నెట్‌వర్క్‌ల విస్తరణ కొత్త విప్లవాన్ని సృష్టిస్తోందన్నారు. ఈ క్రమంలో, గ్లోబల్ 'నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025'లో భారత్ తన స్థానాన్ని నాలుగు పాయింట్లు మెరుగుపరుచుకుని 45వ ర్యాంకులో నిలిచినట్టు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఇక టెక్నాలజీని అనుసరించే దేశం కాదని, ప్రపంచ డిజిటల్ లీడర్‌గా అవతరించిందని సింథియా అన్నారు. ఈ డిజిటల్ విప్లవం కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామాలకు సైతం విస్తరించి ప్రజల జీవన విధానాన్ని మారుస్తోందని ఆయన వివరించారు.


More Telugu News