Shiva Dhar Reddy: ఫోరెన్సిక్ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం.. ఓటుకు నోటు కేసు డాక్యుమెంట్లపై స్పందించిన డీజీపీ

Shiva Dhar Reddy on Forensic Lab Fire Vote for Note Case Documents
  • ఈ కేసులో ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు వెల్లడి
  • మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్న డీజీపీ
  • ఇప్పటి వరకు రూ.3.09 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
  • బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన డీజీపీ
నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో విచారణ జరుపుతున్నామని అన్నారు. ఓటుకు నోటు కేసులో కీలకమైన పైల్స్ తగలబడిపోయాయనే ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. 2015 నాటి ఈ కేసులో ఆధారాలను 2021లోనే కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అన్నీ పరిశీలించాకే నివేదికలు ఇచ్చామని అన్నారు.

రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని డీజీపీ వెల్లడించారు.

బందోబస్తు కోసం ఇతర శాఖల నుంచి మూడు వేల అదనపు బలగాలను రప్పించామని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని... 4,318 మందిని బైండోవర్ చేశామని, 398 మందికి నాన్-బెయిల్ వారెంట్లు జారీ చేశామని వెల్లడించారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 55 చెక్ పోస్టులు ఉన్నాయని అన్నారు.

ఇప్పటి వరకు రూ.3.09 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 142 కేసులు నమోదు చేశామని అన్నారు. 181 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను సిద్ధం చేశామని అన్నారు. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
Shiva Dhar Reddy
Telangana DGP
Forensic Lab Fire
Vote for Note Case
Telangana Municipal Elections

More Telugu News