సుంకాలు సున్నా చేసి ఉంటే.. అమెరికా గెలిచేదేమో: పీయూష్ గోయల్ చమత్కారం

  • టీ20 మ్యాచ్‌లో యూఎస్ జట్టు ప్రదర్శన అద్భుతమ‌న్న‌ పీయూష్ గోయల్
  • భారత వస్తువులపై సుంకాలు సున్నా చేసి ఉంటే అమెరికా గెలిచేదేమోనని చమత్కారం
  • యూఎస్ రాయబారి ఏర్పాటు చేసిన విందులో కేంద్రమంత్రి వ్యాఖ్యలు
  • క్రికెట్‌ను, వాణిజ్య ఒప్పందాలను ముడిపెడుతూ సరదాగా మాట్లాడిన గోయల్
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా క్రికెట్ జట్టు ప్రదర్శనపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. భారత్‌ చేతిలో ఓడిపోయినప్పటికీ, ఆ జట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడారు. ఇదే సమయంలో అమెరికా గనుక భారత వస్తువులపై సుంకాలను సున్నా చేసి ఉంటే, బహుశా ఆ జట్టే మ్యాచ్ గెలిచేదేమోనని ఆయన చమత్కరించారు.

సోమవారం అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఏర్పాటు చేసిన ఓ విందుకు గోయల్ హాజరయ్యారు. శనివారం జరిగిన భారత్-యూఎస్ఏ మ్యాచ్‌ను రాయబారి సెర్గియో కూడా వీక్షించారు. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి చేసిన సరదా వ్యాఖ్యలకు గోయల్ బదులిచ్చారు.

"టీ20 మ్యాచ్‌లో అమెరికా ఓడిపోయి ఉండొచ్చు. కానీ, కొన్ని సంవత్సరాల క్రితమే క్రికెట్ ఆడటం ప్రారంభించిన దేశంగా వారి ప్రదర్శన నిజంగా అద్భుతం. అమెరికా 18 శాతం తేడాతో ఓడిపోయిందని రాయబారి సెర్గియో ప్రస్తావించారు. దానికి నేను ఒకటే సూచన ఇచ్చాను. మీరు గనుక పరస్పర సుంకాలను సున్నా చేసి ఉంటే, బహుశా మీరే గెలిచేవారేమో. యూఎస్ జట్టు ప్రదర్శన నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది" అని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. క్రికెట్‌ను, వాణిజ్య సంబంధాలను ముడిపెడుతూ ఆయన చేసిన ఈ సరదా వ్యాఖ్యలు అక్కడున్న వారిని హాయిగా నవ్వించాయి.


More Telugu News