Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams BJP Says Owaisi is Lifeline
షార్ట్స్‌లో చూడండి
బీజేపీకి లైఫ్‌లైన్ అసదుద్దీన్ ఒవైసీయేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు తెరపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ నాయకులు అసదుద్దీన్ ఒవైసీ పేరును ఎన్నిసార్లు తలుచుకుంటారోనని ఎద్దేవా చేశారు. మజ్లిస్ పార్టీని చూపించి ఇంకా ఎంతకాలం ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. బీజేపీ తెల్లారితే అసదుద్దీన్‌నే తలుచుకుంటారని, ఆయనే వారికి దేవుడు అన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. మోదీని చూసి ఓటు వేయాలని బీజేపీ నాయకులు చెబుతున్నారని, గల్లీ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు బీజేపీ నేతలు వచ్చి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు సహజంగానే వస్తాయని, వీరు తేవడమేమిటని అన్నారు. ప్రత్యేకంగా వారు ఏమైనా నిధులు తెస్తే చెప్పుకోవాలని అన్నారు.

తెలంగాణ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 42 పైసలు వస్తున్నాయని, అదే బీహార్ రూపాయి చెల్లిస్తే ఆరు రూపాయలు వెళుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. దక్షిణాదిను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాలకు అధిక నిధులు ఇస్తున్నారని, ఈ వివక్షపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. భారీ ప్రాజెక్టులు అన్నీ ఉత్తరాదికే వెళుతున్నాయని ఆరోపించారు. కేంద్రం కొత్తగా ఇచ్చిన ప్రాజెక్టులు ఏవీ లేవన్నారు.

పన్నెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నారని, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ తెలంగాణను పాలించిందని, కానీ వారు చేసిందేమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే మోరీని తీయడానికి మోదీ వస్తారా? బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే కేసీఆర్ వస్తారా? అని ప్రశ్నించారు. తాము రెండేళ్లలోనే ఎన్నో పనులు చేశామని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీనే వేతనాలు ఇస్తున్నామని, ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించామని, పదేళ్లు ఇవ్వని రేషన్ కార్డులను ఇచ్చామని, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. మరోమారు కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తమకు ఓటు వేస్తే అభివృద్ధి పూచీ మాదే అన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana
BJP
Asaduddin Owaisi
Municipal Elections
Kishan Reddy
Bandi Sanjay

More Telugu News