టీ20 ప్రపంచకప్: అరంగేట్రంలోనే బెథెల్ అర్ధ శతకం.. పీటర్సన్ రికార్డు సమం!
- టీ20 వరల్డ్ కప్‌లో నేపాల్‌పై ఉత్కంఠ పోరులో గెలిచిన ఇంగ్లండ్
- అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టిన యువ ఆటగాడు జాకబ్ బెథెల్
- కెవిన్ పీటర్సన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ బ్యాటర్‌గా రికార్డు
- జోస్ బట్లర్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి
మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ త్వరగా ఔట్ కాగా, జోస్ బట్లర్ (22) వేగంగా ఆడినా ఎక్కువసేపు నిలవలేదు. అయితే ఈ క్రమంలో బట్లర్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టామ్ బాంటన్ (2) కూడా విఫలమవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.
ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన బెథెల్, కెప్టెన్ హ్యారీ బ్రూక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నేపాల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. బ్రూక్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 71 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. బెథెల్ అద్భుత ఇన్నింగ్స్ వల్లే ఇంగ్లండ్ పోరాడగలిగే స్కోరు చేయగలిగింది. బెథెల్ అద్భుతంగా ఆడాడని, ముఖ్యంగా స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్న విధానం బాగుందని కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రశంసించాడు. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 11న ఇదే వేదికపై వెస్టిండీస్‌తో ఆడనుంది.