Gudia Mahour: రిపేర్లు చేయడానికి ఏజెన్సీ నిరాకరణ.. నడిరోడ్డుపై ఈ-రిక్షాను తగులబెట్టిన మహిళ.. వీడియో ఇదిగో!

E Rickshaw Set Ablaze by Woman in Shivpuri Over Repair Issues
షార్ట్స్‌లో చూడండి
దినసరి కూలీ పనుల నుంచి విముక్తి పొంది, సొంతంగా ఉపాధి వెతుక్కోవాలన్న ఒక మహిళ కల కళ్లముందే బూడిదైంది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో గుడియా మహౌర్ అనే మహిళ, తన ఈ-రిక్షాకు పదేపదే సమస్యలు వస్తున్నా షోరూం నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. నెలల తరబడి తిరిగినా ఫలితం లేకపోవడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె సదరు ఏజెన్సీ ముందే తన వాహనాన్ని తగులబెట్టి నిరసన తెలిపింది.

ఫక్కర్ కాలనీకి చెందిన గుడియా తన భర్తతో కలిసి ఆరు నెలల క్రితం రూ. 2.5 లక్షల అప్పు చేసి ఈ-రిక్షా కొనుగోలు చేసింది. అయితే, అది కొన్న రెండు నెలలకే మొరాయించడం మొదలుపెట్టింది. గత నాలుగు నెలలుగా రిపేర్ల కోసం ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నా, వారు కనికరించకపోగా వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. అటు వాహనం నడవక, ఇటు అప్పు తీర్చలేక తిరిగి కూలి పనులకు వెళ్లాల్సి రావడంతో గుడియా తీవ్ర వేదనకు లోనైంది.

చివరి ప్రయత్నంగా ఏజెన్సీకి వెళ్లినప్పుడు కూడా వారు నిరాకరించడంతో నడిరోడ్డుపై వాహనాన్ని నిలిపి పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. అయితే, తయారీ లోపం ఏమీ లేదని, కేవలం బ్యాటరీ పేలడం వల్లే సమస్య వచ్చిందని, దానికి వారంటీ వర్తించదని షోరూం నిర్వాహకులు వాదిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పులు తీర్చి, కుటుంబాన్ని పోషించాలనుకున్న ఒక మహిళ కసి, కన్నీరు శివపురి మార్కెట్ వీధుల్లో మంటల రూపంలో కనిపించడం స్థానికులను కలచివేసింది. 
Go Back to Shorts
Gudia Mahour
E-rickshaw
Shivpuri
Madhya Pradesh
Vehicle Fire
Loan Debt
E-rickshaw Repair
Agency Negligence
Battery Issue
Protest

More Telugu News