విజయవాడ ఆసుపత్రిలో కలకలం: పీజీ వైద్యురాలి అనుమానాస్పద మృతి

  • ఆపరేషన్ థియేటర్‌లో దీపిక మృతి
  • చేతిపై ఇంజెక్షన్ గుర్తులపై మిస్టరీ 
  • టేబుల్‌పై అచేతనంగా కనిపించిన వైద్యురాలు
  • తోటి వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం శూన్యం
  • విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనస్థీషియా విభాగంలో పీజీ చివరి ఏడాది చదువుతున్న డాక్టర్ బత్తుల దీపిక ఆపరేషన్ థియేటర్లోనే విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. మరో నాలుగు నెలల్లో పీజీ పూర్తి చేసుకుని వృత్తి జీవితంలో స్థిరపడుతుందనుకున్న తరుణంలో ఆమె మరణం తోటి వైద్యులను, కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

బుధవారం రాత్రి విధుల్లో ఉన్న దీపిక, అర్ధరాత్రి 1:10 గంటల వరకు సాధారణంగానే ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాలు చెబుతున్నాయి. అయితే, కేవలం అరగంట వ్యవధిలోనే అంటే 1:40 గంటల సమయంలో ఆమె ఆపరేషన్ థియేటర్లోని బల్లపై అచేతనంగా పడి ఉండటం గమనార్హం. తోటి వైద్యులు వెంటనే స్పందించి సీపీఆర్ చేసి, వెంటిలేటర్ మీద ఉంచి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. సరిగ్గా ఆ అరగంట కాలంలో ఆపరేషన్ థియేటర్ లోపల ఏం జరిగిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

దీపిక చేతిపై నాలుగు ఇంజెక్షన్ గుర్తులు ఉండటాన్ని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కడుపులో అసౌకర్యంగా ఉందన్న కారణంతో సహచర వైద్యురాలు ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వేసిన కాన్యులా వల్ల రెండు గుర్తులు పడి ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ, మిగిలిన రెండు గుర్తులు ఎక్కడివి? ఎందుకు వేయాల్సి వచ్చింది? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దురదృష్టవశాత్తు, గోప్యత కారణాల దృష్ట్యా ఆపరేషన్ థియేటర్లో సీసీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు సవాలుగా మారింది.

అనంతపురం జిల్లాకు చెందిన దీపిక తల్లిదండ్రులు ఇద్దరూ వైద్య ఆరోగ్య శాఖలోనే పనిచేస్తున్నారు. "కూతురిని పెళ్లి కుమార్తెగా చూడాలనుకుంటే.. ఇలా చూడాల్సి వస్తుందని ఊహించలేదు" అంటూ ఆమె తల్లి రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది. తన సోదరి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని దీపిక సోదరి డాక్టర్ మౌనిక పోలీసులను కోరారు. 

కాగా, కడుపులో ఇబ్బందిగా ఉందని, ఇంజక్షన్ చేయాలని కోరడం వల్లే తోటి పీజీ వైద్యురాలు ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ ఏడు కొండలరావు తెలిపారు.  వేధింపుల కోణంలోనూ విచారరిస్తున్నట్టు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే దీపిక మృతికి గల అసలు కారణం తెలుస్తుందని చెప్పారు.

ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశించారు. అటు ఆసుపత్రి యంత్రాంగం కూడా అంతర్గత విచారణ కోసం ఒక కమిటీని వేసింది. మృతికి కారణం అనారోగ్యమా, పని ఒత్తిడా లేక మరేదైనా వేధింపులా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.


More Telugu News