Tammineni Koteswara Rao: సీపీఎం నుంచి తమ్మినేని సోదరుడు కోటేశ్వరరావు బహిష్కరణ

Tammineni Koteswara Rao Expelled from CPM
షార్ట్స్‌లో చూడండి
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావుపై పార్టీ నాయకత్వం కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో ఆయన్ను ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఖమ్మం రూరల్ మండల కమిటీ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ నిర్ణయానికి దారితీశాయి.

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు (తెల్దారుపల్లి) నుంచి సీపీఎం అభ్యర్థిగా కోటేశ్వరరావు భార్య విజయలక్ష్మి నామినేషన్ వేశారు. అయితే, పార్టీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీనివల్ల కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వయానా పార్టీ ముఖ్య నేత సోదరుడే ఇలా అభ్యర్థిని పోటీ నుంచి తప్పించి కాంగ్రెస్‌కు దారి సుగమం చేయడంపై సీపీఎం కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిజానికి ఏకగ్రీవంగా ఎన్నికైన మంగతాయి, దివంగత నేత తమ్మినేని కృష్ణయ్య భార్య. 2022లో కృష్ణయ్య హత్యకు గురైన ఘటనలో కోటేశ్వరరావు నిందితుడిగా ఉన్నారు. ఆ హత్య తర్వాత రెండు కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. అయితే, గ్రామంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొందరు పెద్దల సమక్షంలో జరిగిన రాజీలో భాగంగానే విజయలక్ష్మి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబాల మధ్య గొడవలు సద్దుమణిగినందుకు గ్రామస్థులు సంతోషించినా, పార్టీ అభ్యర్థిని స్వతంత్రంగా తప్పించడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని సీపీఎం స్పష్టం చేసింది.

గతంలోనూ కోటేశ్వరరావు వ్యవహారశైలిపై పార్టీ అంతర్గతంగా హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదని సీపీఎం నాయకులు చెబుతున్నారు. వ్యక్తిగత నిర్ణయాలను పార్టీపై రుద్దడం, అభ్యర్థులను ఉపసంహరించుకోవడం వంటి చర్యలను ఉపేక్షించకూడదనే ఉద్దేశంతోనే ఈ బహిష్కరణ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం రాజకీయాల్లో ముఖ్యంగా తమ్మినేని కుటుంబానికి పట్టున్న ప్రాంతంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Tammineni Koteswara Rao
CPM
CPIM
Khammam
Telangana Politics
Local Body Elections
Tamineni Krishnaiah
Congress
Expulsion

More Telugu News