ఆర్‌ఏసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బెర్త్ దొరక్కుంటే కొంత డబ్బు వాపస్!
- పూర్తి ఛార్జీ వసూలుపై పార్లమెంటరీ కమిటీ అభ్యంతరం
- బెర్త్ లభించని వారికి కొంత నగదు వాపసు ఇవ్వాలని సూచన
- కొత్త రీఫండ్ వ్యవస్థను కోరిన పార్లమెంటరీ ప్యానెల్
- వందేభారత్ స్లీపర్ సహా పలు రైళ్లలో ఆర్‌ఏసీ నిలిపివేత
ఫిబ్రవరి 4న పార్లమెంటుకు సమర్పించిన ‘పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్’ నివేదికలో కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. చార్ట్ తయారయ్యాక కూడా బెర్త్ లభించని ప్రయాణికులకు, వారు చెల్లించిన ఛార్జీలో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ప్రస్తుతం ఇద్దరు ఆర్‌ఏసీ ప్రయాణికులు ఒకే బెర్త్‌ను పంచుకుంటున్నారు, అయితే రైల్వే మాత్రం ఇద్దరి నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈ పద్ధతి వినియోగదారులకు భారమని కమిటీ అభిప్రాయపడింది.
ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు టికెట్ క్యాన్సిల్ చేయకపోతే ఎటువంటి రీఫండ్ లభించదు. కానీ, ప్రయాణం చేస్తున్న సమయంలో బెర్త్ లభించని పక్షంలో ప్రయాణికులకు న్యాయం జరగడం లేదని కమిటీ పేర్కొంది. దీనిపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు, ఈ ఏడాది ప్రారంభం నుంచి రైల్వే శాఖ కొన్ని కీలక మార్పులు చేపట్టింది. హౌరా–కామాఖ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌తో సహా మొత్తం 13 రైళ్లలో ఆర్‌ఏసీ ప్రయాణికులు బోర్డింగ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ రైళ్లలో కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారు మాత్రమే ప్రయాణించేలా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది.