Amit Shah: క్యాబ్‌ రంగంలో కొత్త శకం: ‘భారత్ ట్యాక్సీ’ని ప్రారంభించిన అమిత్ షా

Amit Shah launches Bharat Taxi a new cab service
  • డ్రైవర్లే యజమానులుగా సహకార సేవల విప్లవం
  • సర్జ్ ప్రైసింగ్ లేదు.. జీరో కమీషన్ విధానం
  • లాభాలన్నీ నేరుగా డ్రైవర్ల ఖాతాల్లోకే..
  • వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరణకు ప్రణాళిక
దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఊరటనిస్తూ, డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం 'భారత్ ట్యాక్సీ' సేవలను అధికారికంగా ప్రారంభించింది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ సహకార ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ దిగ్గజాలకు దీటైన ప్రత్యామ్నాయంగా ఈ యాప్ నిలవనుంది.

ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను, వచ్చే రెండేళ్లలో అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు అమిత్ షా ప్రకటించారు. మూడేళ్ల వ్యవధిలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం కార్లే కాకుండా ఆటోలు, బైక్ ట్యాక్సీలను కూడా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకునే వీలుంది.

ఈ వేదిక ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 'జీరో కమీషన్' పద్ధతిలో పనిచేస్తుంది. అంటే కంపెనీ ఎటువంటి లాభాన్ని తన వద్ద ఉంచుకోదు. సర్జ్ ప్రైసింగ్ (రద్దీ సమయంలో రేట్లు పెంచడం) వంటి విధానాలు ఇక్కడ ఉండవు. 'సారథి' పథకం కింద డ్రైవర్లకు ఆరోగ్య, ప్రమాద బీమాతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సుమారు రూ.10 కోట్ల లాభాలను డ్రైవర్లకు పంపిణీ చేయడం విశేషం.  ప్రస్తుతం 3 లక్షల మంది డ్రైవర్లు, లక్ష మందికి పైగా కస్టమర్లు ఈ యాప్‌లో నమోదయ్యారు.

ఎనిమిది ప్రముఖ సహకార సంస్థల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న 'భారత్ ట్యాక్సీ', ప్రపంచంలోనే అతిపెద్ద సహకార ఆధారిత రైడ్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు పొందింది. ప్రైవేట్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, డ్రైవర్లను యజమానులుగా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని సహకార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఢిల్లీలో ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఏడు సపోర్ట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు.
Amit Shah
Bharat Taxi
cab service
ride booking app
cooperative society
transportation
zero commission
driver welfare
Ola Uber alternative
India

More Telugu News