Rajinikanth: పారిశుద్ధ్య కార్మికురాలు పద్మకు రజనీకాంత్ సత్కారం

Rajinikanth Honored Sanitation Worker Padma With Gold Chain
  • 45 సవర్ల బంగారం అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలికి సత్కారం
  • పద్మ అనే మహిళను ఇంటికి పిలిచి బంగారు గొలుసు బహూకరించిన రజనీకాంత్
  • పద్మ నిజాయతీని మెచ్చి ఇప్పటికే సత్కరించిన సీఎం స్టాలిన్ 
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన ఉదార స్వభావాన్ని, మంచి మనసును చాటుకున్నారు. నిజాయతీగా వ్యవహరించిన ఓ పారిశుద్ధి కార్మికురాలిని ఇంటికి పిలిచి స్వయంగా సత్కరించారు. ఆమె నిజాయతీని మెచ్చి ఓ బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, చెన్నైకి చెందిన పద్మ అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో టీ నగర్‌లో విధుల్లో ఉండగా, ఆమెకు ఓ పర్సు దొరికింది. దాన్ని తెరిచి చూడగా, అందులో 45 సవర్ల (తులాల) బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఏమాత్రం ఆశపడని పద్మ, వెంటనే తన పై అధికారులకు సమాచారం అందించి, ఆ బంగారాన్ని పాండీ బజార్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరిపి, ఆ ఆభరణాలను అసలు యజమానులకు అందజేశారు.

పద్మ నిజాయతీ గురించి తెలిసి పలువురు ఆమెను ప్రశంసించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్వయంగా ఆమెను అభినందించి, లక్ష రూపాయల చెక్కును బహుమతిగా అందించారు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, మంగళవారం పద్మను తన నివాసానికి ఆహ్వానించారు. ఆమె నిజాయతీని ప్రశంసించి, ఓ బంగారు గొలుసును బహూకరించారు.

పేదలకు కేవలం ఐదు రూపాయలకే పరోటాలు అమ్ముతున్న మధురైకి చెందిన తన వీరాభిమాని రజనీ శేఖర్‌ను కూడా రజనీకాంత్ కొన్ని రోజుల క్రితం ఇలాగే బంగారు గొలుసుతో సత్కరించిన విషయం తెలిసిందే.

ఇక సినిమాల విషయానికొస్తే, రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' సినిమా పనుల్లో ఉన్నారు. దీంతో పాటు, దర్శకుడు సిబి చక్రవర్తితో చేయబోయే సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని ఆయన ఇటీవలే పొంగల్ పండుగ సందర్భంగా వెల్లడించారు. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News

Rajinikanth
Padma sanitation worker
Tamil Nadu
Chennai
MK Stalin
Jailer 2 movie
Rajini Shekhar
Pandit Bazaar police
Anirudh music director