పద్మ పురస్కార విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు

  • పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
  • 13 మంది తెలుగు ప్రముఖులకు పురస్కారాలు రావడంపై చంద్రబాబు హర్షం
  • ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్
  • మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ సహా పలువురికి పద్మశ్రీ
  • ఈ పురస్కారాలు అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్ష
2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు శుభాకాంక్షలు చెబుతూ, ముఖ్యంగా 13 మంది తెలుగు వారికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కడం పట్ల ఆయన ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.

ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ పురస్కారం లభించడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా, పద్మశ్రీ పురస్కారాలు పొందిన వారందరికీ ఆయన పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు. విజేతలలో యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ ఉన్నారు.

ఇంకా సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్, గడ్డమనుగు చంద్రమౌళి... వైద్య రంగంలో పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, గూడూరు వెంకట్రావు... సాహిత్య రంగంలో వెంపటి కుటుంబ శాస్త్రి... నృత్యంలో దీపికారెడ్డిలకు అభినందనలు తెలిపారు. మరణానంతరం పద్మశ్రీ పొందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), రామారెడ్డి మామిడి (పశుసంవర్ధక)ల సేవలను కూడా సీఎం స్మరించుకున్నారు.

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించి తెలుగు జాతి ఖ్యాతిని మరింతగా వెలిగించిన ఈ ప్రముఖుల విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.


More Telugu News