ఆ ఒక్క తప్పు చేయకుంటే కాఫీతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయట.. అదేంటంటే!

  • కాఫీ తాగే అలవాటు వల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందంటున్న నిపుణులు
  • మధుమేహం, కాలేయ సమస్యలనూ తగ్గిస్తుందని గత పరిశోధనలలో వెల్లడి
  • రోజుకు 2 నుంచి 4 కప్పుల కాఫీ తాగడం మేలు.. అదీ ఉదయం పూట మాత్రమేనంటున్న నిపుణులు
ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తాగిన తర్వాతే చాలామందికి ఆ రోజు మొదలవుతుంది. రోజులో నాలుగైదుసార్లు తాగకుండా ఉండలేని కాఫీ ప్రియులకు శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. కాఫీ తాగే అలవాటుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. గుండె జబ్బుల ముప్పును తగ్గించడం నుంచి కాలేయ సమస్యల రిస్క్ ను తగ్గించడం దాకా.. చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల శరీరానికి ప్రయోజనం కలుగుతుందని, మధ్యాహ్నం తర్వాత కానీ సాయంత్రం కానీ తాగితే మాత్రం ఈ ప్రయోజనాలు దక్కకపోగా అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ మేరకు యురోపియన్ స్టడీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన తాజా అధ్యయనంలో కాఫీ తాగే అలవాటు ఉన్న వారు మిగతా వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని తేలింది. రోజుకు 2 నుంచి 4 కప్పుల కాఫీ తాగడం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. అయితే, మధ్యాహ్నం తర్వాత కానీ సాయంత్రం కానీ కాఫీ తాగడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువని హెచ్చరించారు.

మధ్యాహ్నం తర్వాత కాఫీ తాగితే ఏమవుతుందంటే..
మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం పూట కాఫీ తాగిన తర్వాత శరీరంలోకి చేరే కెఫిన్ మన మెదడులో కీలకమైన అడెనోసిన్ రసాయనాన్ని అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాత్రిపూట మనం హాయిగా నిద్రించేందుకు ఈ రసాయనం తోడ్పడుతుందని చెబుతూ.. కెఫిన్ ఈ రసాయనాన్ని అడ్డుకోవడం వల్ల నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాదు, సాయంత్రం పూట తాగే కాఫీ వల్ల మన శరీరంలోని జీవగడియారం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఫలితంగా నిద్రలేమి.. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.


More Telugu News