ఏపీలో ఆ భూములకు మార్కెట్ ధరలు పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

  • ఏపీలో పట్టణ ప్రాంత భూముల విలువలు పెంపు
  • ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం పెరగనున్న మార్కెట్ విలువ
  • ప్రభుత్వ ఆదాయం పెంచడమే లక్ష్యంగా నిర్ణయం
  • జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కొత్త విలువల సవరణ
  • రూ.11,221 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం
ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూముల విలువలను 10 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు రాబోయే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంతో పాటు అధికారిక విలువకు, వాస్తవ మార్కెట్ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గతేడాది ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలను 5 నుంచి 10 శాతం వరకు సవరించారు. అయితే, ఈసారి పెంపును కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నిచోట్ల అశాస్త్రీయంగా ధరలు పెంచారనే విమర్శల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని ప్రాంతాల్లో ధరలను తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేసింది. తాజాగా మళ్లీ పట్టణ ప్రాంతాల్లో ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీలు ఈ విలువల సవరణను ఖరారు చేస్తాయి. ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, రోడ్ల కనెక్టివిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సవరించిన ధరల వివరాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

2024–25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.8,843 కోట్ల ఆదాయం రాగా, 2025–26 సంవత్సరానికి గాను రూ.11,221 కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే ఈ లక్ష్యంలో జనవరి 9 నాటికి రూ.8,391 కోట్లు వసూలు కావడం విశేషం. తాజా పెంపుతో ప్రభుత్వ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.


More Telugu News