వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ను తొలగించిన ఐసీసీ!

  • 2026 టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్‌ ఔట్!
  • భారత్‌లో భద్రతా కారణాలతో టోర్నీని బహిష్కరించిన బంగ్లాదేశ్
  • బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక!
అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ జట్టును తొలగిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లోకి తీసుకుంటున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు ఐసీసీ లేఖ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తోంది. 2007 నుంచి ప్రతి టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడిన బంగ్లాదేశ్ ప్రస్థానానికి ఐసీసీ కఠిన నిర్ణయంతో తొలిసారి బ్రేక్ పడింది.

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది. ఈ సమస్యలను ఐసీసీ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సరైన పరిష్కారం లభించలేదని ఆరోపిస్తూ, టోర్నమెంట్‌ను బహిష్కరిస్తున్నట్లు బీసీబీ గురువారం ప్రకటించింది. ఈ వివాదాన్ని డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీకి అప్పగించాలని బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. కమిటీకి అప్పీళ్లపై విచారణ జరిపే అధికారం లేదని, ఐసీసీ తీసుకున్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. టోర్నీలో పాల్గొనకపోతే స్కాట్లాండ్‌తో భర్తీ చేస్తామని ఇచ్చిన అల్టిమేటంపై బీసీబీ నుంచి స్పందన రాకపోవడంతో ఐసీసీ ఈ నిర్ణయాన్ని అమలు చేసినట్టు సమాచారం. దీనిపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ మార్పుతో స్కాట్లాండ్ జట్టు నేరుగా గ్రూప్ సిలో ప్రవేశిస్తుంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్ వంటి జట్లు ఉన్నాయి. స్కాట్లాండ్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్‌తో మ్యాచ్ లు ఉన్నాయి.

స్కాట్లాండ్ ఇప్పటివరకు ఐదు టీ20 ప్రపంచకప్‌లలో పాల్గొంది. గత రెండు టోర్నీల్లో సూపర్ 8 దశకు చేరుకోలేకపోయినా, పెద్ద జట్లకు గట్టిపోటీనిచ్చింది. 




More Telugu News