జాన్ అబ్రహాంకు నటన వచ్చేది కాదు: రిమీ సేన్

  • జాన్ అబ్రహాం కెరీర్ ఎదుగుదలపై రిమీ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • తొలుత ఆయన మోడల్ మాత్రమేనని వెల్లడి
  • తెలివిగా పాత్రలను ఎంచుకోవడమే ఆయన విజయానికి కారణమని వ్యాఖ్య

2000వ దశకంలో ‘ధూమ్’, ‘హంగామా’, ‘ఫిర్ హేరా ఫేరీ’ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ యువతను ఆకట్టుకున్న నటి రిమీ సేన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడిన ఆమె, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన సినీ ప్రయాణంతో పాటు పలువురు స్టార్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


కెరీర్ ప్రారంభ దశలో జాన్ అబ్రహాం ఒక మోడల్ మాత్రమేనని, అప్పట్లో అతనికి నటన పెద్దగా రాదని రిమీ సేన్ స్పష్టంగా చెప్పారు. అయితే తన బలహీనతలను అర్థం చేసుకుని, తెలివిగా పాత్రలను ఎంచుకోవడమే జాన్ అబ్రహం విజయానికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. తన నటనపై విమర్శలు వచ్చినా వాటికి స్పందించకుండా, తన బాడీ, లుక్స్ హైలైట్ అయ్యే యాక్షన్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చాడని, ఇది అతను అనుసరించిన స్ట్రాటజీ అని వివరించారు.


ఒకసారి క్రేజ్ వచ్చాక కెమెరా ముందు అనుభవంతో మెల్లమెల్లగా నటన కూడా మెరుగుపర్చుకున్నాడని, ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా చేయగలిగాడని రిమీ సేన్ తెలిపారు. ప్రస్తుతం జాన్ అబ్రహాం కేవలం నటుడిగానే కాకుండా మంచి బిజినెస్‌మ్యాన్‌గా కూడా ఎదిగాడని, ప్రొడక్షన్ రంగంలోకి వచ్చి కంటెంట్‌కు విలువ ఉన్న సినిమాలను నిర్మిస్తూ విజయాలు సాధిస్తున్నాడని ప్రశంసించారు.


2004లో సంజయ్ గాధ్వి దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘ధూమ్’ సినిమా అప్పట్లో బాలీవుడ్‌ను ఊపేసిందని, అదే యాక్షన్ ఫ్రాంచైజీకి బీజం వేసిందని రిమీ సేన్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో అభిషేక్ బచ్చన్ భార్య పాత్రలో రిమీ సేన్ నటించగా, జాన్ అబ్రహాం నెగెటివ్ రోల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.


ఇక జాన్ అబ్రహాం తాజా ప్రాజెక్టుల విషయానికి వస్తే, చివరిగా ‘టెహ్రాన్’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్‌తో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తారిఖ్’ సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు, రిమీ సేన్ తెలుగులో కూడా తన గ్లామర్‌తో అభిమానులను సంపాదించారు. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ‘అందరివాడు’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.



More Telugu News