'టాక్సిక్' టీజర్ వివాదంపై సెన్సార్ చీఫ్ ఏమన్నారంటే..!

  • ప్రస్తుత పరిస్థితుల్లో 'టాక్సిక్' టీజర్ వివాదంపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేనన్న సెన్సార్‌ బోర్డు ఛైర్మన్‌ ప్రసూన్‌ జోషి
  • డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే చాలా వీడియోలకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఉండదని వ్యాఖ్య
  • చూసే ప్రతి కంటెంట్‌ సెన్సార్‌ పొందిందే అన్న భావన నుంచి ప్రేక్షకులు బయటపడాలని సూచన
యష్ హీరోగా రూపొందుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ చుట్టూ అలముకున్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేనని తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా కంటెంట్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

టాక్సిక్ టీజర్ వివాదంపై ఈ దశలో తాను వ్యాఖ్యానించలేనని పేర్కొన్న ఆయన, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే చాలా వీడియోలకు సెన్సార్ సర్టిఫికెట్ ఉండదని తెలిపారు. అవి తమ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలని సూచించారు. చూసే ప్రతి కంటెంట్ సెన్సార్ పొందిందే అన్న భావన నుంచి ప్రేక్షకులు బయటపడాలన్నారు. ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉంటుందని చాలా మంది భావిస్తారని కానీ అవి తమ వద్దకు రావని, వాటికి ధ్రువీకరణ ఉండదని ప్రసూన్ జోషి స్పష్టం చేశారు.

అలాగే ఇటీవల వివాదాస్పదంగా మారిన మరో మూవీ జన నాయగన్‌పై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఆ అంశం ప్రస్తుతం చట్టపరమైన పరిధిలో ఉందని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.

యష్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టాక్సిక్' చిత్రానికి ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్ అనే ఉపశీర్షిక ఉంది. యష్ పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, మహిళా కమిషన్ ఈ వివాదంపై చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. 


More Telugu News