కోట్ల విలువ చేసే ఆస్తిని కొనుగోలు చేసిన కోహ్లీ-అనుష్క!

  • మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్ ప్రాంతంలో భూమి కొనుగోలు చేసిన కోహ్లీ, అనుష్క
  • కొనుగోలు చేసిన భూమి విలువ రూ.37.86 కోట్లుగా పేర్కొన్న సీఆర్ఈ మ్యాట్రిక్స్ 
  • జనవరి 13న భూమి కొనుగోలు చేసిన కోహ్లీ, అనుష్క
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు సంబంధించిన ఒక శుభవార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెలబ్రిటీ జంట మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, అలీబాగ్ ప్రాంతంలో ఐదు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ ఆస్తి పత్రాల ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ.37.86 కోట్లుగా ఉంటుందని అంచనా.

రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్ పరిధిలోని జిరాద్ గ్రామంలో గల గాట్ నంబర్లు 157, 158లో ఈ భూమి ఉంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ప్రకారం, దీని మొత్తం విస్తీర్ణం 21,010 చదరపు మీటర్లు, అంటే దాదాపు 5.19 ఎకరాలు. ఈ లావాదేవీ జనవరి 13న రిజిస్టర్ అయింది. సోనాలి అమిత్ రాజ్‌పుత్ నుంచి విరాట్, అనుష్క దంపతులు ఈ భూమిని కొనుగోలు చేసినట్లు సీఆర్ఇ మ్యాట్రిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ కిరణ్ గుప్తా తెలిపారు.

నిబంధనల ప్రకారం ఈ లావాదేవీకి సంబంధించి విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30 వేలుగా, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.1,000గా నమోదయ్యాయి.

అలీబాగ్‌లో విరాట్ -అనుష్క పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకే 2022లో రూ.19.24 కోట్లకు దాదాపు 8 ఎకరాల భూమిని ఈ జంట కొనుగోలు చేసింది. ఆ తరువాత ఆ భూమిలో ఒక విలాసవంతమైన వెకేషన్ హోమ్‌ను కూడా నిర్మించారు. దీంతో అలీబాగ్‌లో వీరి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మరింతగా విస్తరించినట్లు తెలుస్తోంది.

ఇదే ప్రాంతంలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా అలీబాగ్‌లో గతంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ప్రముఖుల జాబితాలో ఉన్నారు. 


More Telugu News