విజయ్ 'జన నాయగన్' చిత్రం విడుదల వాయిదా... సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • సినిమాకు సర్టిఫికెట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు
  • మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన నిర్మాతలు
  • పిటిషన్‌ను తిరస్కరించి, డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచన
ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా విడుదల కోసం సర్టిఫికెట్ జారీకి స్టే విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది.

మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని కూడా హైకోర్టు డివిజన్ బెంచ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని భావించినప్పటికీ, సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విడుదల వాయిదా పడింది.

విచారణ సందర్భంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడం వల్ల నిర్మాత చాలా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. మద్రాస్ హైకోర్టులో సీబీఎఫ్‌సీ తన ప్రతిస్పందనను తెలియజేయడానికి తగినంత సమయం ఎందుకు ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు నిర్మాతల తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఈ నెల 20 లోపు మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించేలా ఆదేశించాలని వారు సుప్రీంకోర్టును కోరారు.


More Telugu News