మేడారం మహాజాతరకు అంకురార్పణ: వైభవంగా వనదేవతల 'గుడి మెలిగె పండుగ'

  • మొదలైన జాతర పూజా తంతు
  • పుట్టమట్టి, గుట్టగడ్డితో ఆలయాల అలంకరణ
  • మేడారం, కన్నెపల్లి, పునుగొండ్ల, కొండాయిలో ఆదివాసీ సంప్రదాయ పూజలు
  • ముందస్తు మొక్కుల కోసం పోటెత్తిన 50 వేల మంది భక్తులు
  • జంపన్నవాగులో పుణ్యస్నానాలు
  • అమ్మవార్లకు 'బంగారం' సమర్పణ
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర హంగామా మొదలైంది. బుధవారం వనదేవతల పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో 'గుడి మెలిగె పండుగ'ను నిర్వహించడంతో జాతర అధికారికంగా ప్రారంభమైనట్లయింది. ఈ వేడుకను పురస్కరించుకుని మేడారం, కన్నెపల్లి, పునుగొండ్ల, కొండాయి గ్రామాల్లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

వేకువజామునే పూజారులు, వారి కుటుంబ సభ్యులు అడవికి కాలినడకన వెళ్లి గుట్టగడ్డి, పుట్టమట్టిని సేకరించి తెచ్చారు. సంప్రదాయం ప్రకారం మహిళలు పుట్టమట్టితో ఆలయాలను అలకగా, పురుషులు గుట్టగడ్డితో గుడి పైకప్పులను వేసి ముస్తాబు చేశారు. రోజంతా ఉపవాసం ఉన్న పూజారులు గర్భగుడిని శుభ్రం చేసి, డోలు వాయిద్యాల నడుమ దీపధూప నైవేద్యాలు సమర్పించారు. జాతర ముగిసే వరకు పూజారులు కఠిన నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

జాతర ప్రధాన ఘట్టానికి ముందే మేడారంలో భక్తుల సందడి నెలకొంది. బుధవారం ఒక్కరోజే సుమారు 50 వేల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్ల గద్దెల వద్ద బెల్లం (బంగారం), పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావుతో పాటు సమ్మక్క, సారలమ్మ పూజారులు ఈ క్రతువులో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా సిద్ధం చేస్తోంది.


More Telugu News