శబరిమలలో కనులపండువగా మకరజ్యోతి దర్శనం... పులకించిన భక్తులు

  • అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరి కొండలు
  • పొన్నాంబలమేడుపై మూడుసార్లు కనిపించిన దివ్యజ్యోతి
  • తిరువాభరణాల అలంకరణ తర్వాత జరిగిన ప్రత్యేక పూజలు
  • లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో నిండిపోయిన సన్నిధానం
కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం అశేష భక్తజన సందోహం మధ్య కనులపండువగా జరిగింది. మకర సంక్రాంతి పుణ్యదినమైన బుధవారం సాయంత్రం 6:30 గంటల తర్వాత పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులు "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ చేసిన శరణుఘోషతో శబరిగిరులు మార్మోగిపోయాయి.

అంతకుముందు, పందళం రాజప్రాసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి కనిపించడంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మకరజ్యోతిని సాక్షాత్తు అయ్యప్ప స్వామి జ్యోతిర్మయ రూపంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ జ్యోతిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరతాయని ప్రగాఢంగా నమ్ముతారు.

మకరజ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రద్దీని నియంత్రించేందుకు కొండపైకి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. క్షేత్రానికి రాలేని భక్తుల కోసం పలు టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించాయి. ఏటా మకర సంక్రాంతి నాడు జరిగే ఈ వేడుక కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు 41 రోజుల కఠిన దీక్షతో శబరిమలకు చేరుకుంటారు.


More Telugu News