తక్షణమే ఇరాన్‌ను వీడండి: భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు

  • ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు
  • కీలక ఆదేశాలు జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
  • అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను వీడాలని సూచన
ఇరాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతోన్న ఆందోళనల కారణంగా అక్కడ మారణహోమం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది మృతి చెందగా, అందులో ఆందోళనకారులు 1,850 మంది, భద్రతా దళాల సిబ్బంది 135 మంది ఉన్నారు. ఆందోళనలతో సంబంధం లేని వారు కూడా పదుల సంఖ్యలో మరణించారు. ఆ దేశంలో ఎస్ఎంఎస్‌లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.

ఇరాన్‌లో ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులను అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను వీడాలని సూచించింది. "ఇరాన్‌లోని భారత పౌరులు (విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు) అందుబాటులో ఉన్న విమానాల ద్వారా వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలి" అని పేర్కొంది.

తీవ్రమవుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల కారణంగా టెహ్రాన్‌తో సహా ఇరాన్‌లోని పలు నగరాల్లో పరిస్థితి మరింత దిగజారిందని రాయబార కార్యాలయం హెచ్చరించింది. నిరసన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదించాలని భారతీయ పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులకు తెలిపింది.

ఆకస్మిక తరలింపు లేదా అత్యవసర ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. తక్షణ సహాయం కోసం రాయబార కార్యాలయం అత్యవసర సంప్రదింపు ఫోన్ నెంబర్లను, అధికారిక ఈ-మెయిల్ ఐడీని పంచుకుంది. హెల్ప్‌లైన్ నెంబర్లు 98-9128109115, 98-9128109109, 98-9128109102, 98-9932179359 కాగా, ఈ-మెయిల్ ఐడీ cons.tehran@mea.gov.in లను పంచుకుంది.

తదుపరి నోటీసు వచ్చే వరకు ఆ దేశానికి ప్రయాణం చేయవద్దని భారత విదేశాంగ శాఖ కూడా సూచించింది. విదేశాంగ శాఖ ఇంతకుముందు కూడా ఇలాంటి నోటీసు జారీ చేసింది.


More Telugu News