15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం

  • ఏపీలో ఆరోగ్య రంగానికి రూ. 567 కోట్లు విడుదల చేసిన కేంద్రం
  • నిధుల వినియోగం పెరగడం పట్ల కేంద్రం సంతృప్తిని వ్యక్తం చేసిందన్న సత్యకుమార్
  • మిగులు నిధుల కోసం కేంద్ర ఆర్థిక శాఖతో చర్చలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం
ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య రంగానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆఖరి విడతగా రూ. 567 కోట్ల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 

ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ... గత 19 నెలల కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 48 శాతం మేర నిధులను వినియోగించడం జరిగిందని తెలిపారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో నిధుల వినియోగం పెరగడం పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసిందని చెప్పారు. ఇది, ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుర్తింపును ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు.   

రాష్ట్ర ఆరోగ్య రంగం మరింత బలోపేతం కావడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన మిగుల నిధుల కోసం కేంద్ర ఆర్థిక శాఖతో వెంటనే చర్చలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా, పూర్తి స్థాయిలో ఆర్థిక సాయాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల బలోపేతం, ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా పొందిన మూడవ రాష్ట్రంగా ఏపీ అవతరించిందని చెప్పారు.


More Telugu News