భోగి వేడుకల వేళ... కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు
- నగరిలో కుటుంబంతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న రోజా
- రైతన్నలు ఆనందంగా పండుగ చేసుకోలేపోతున్నారని ఆవేదన
- వైద్య రంగాన్ని ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శ
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గంలోని తన నివాసంలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భోగి పండుగ పాతదాన్ని దహనం చేసి కొత్తదాన్ని ఆహ్వానించే సందర్భమని, మన జీవితాల్లోని చెడు, బాధలను కూడా ఆ మంటల్లో కాల్చేసి కొత్త వెలుగులు, కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఆమె రాజకీయ విమర్శలు గుప్పించారు.
జగన్ హయాంలో పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేసిందని ఆరోపించారు. పేదల చేతుల్లో డబ్బులు లేక పండుగ ఆనందంగా జరుపుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్రాంతి అనేది రైతన్నలకు పంట చేతికొచ్చి చేతినిండా డబ్బులు ఉండే పండుగ అని అన్నారు. కానీ, ఇప్పుడు రబీకి ఆర్థిక సహాయం కూడా అందకపోవడం, ప్రభుత్వం ఇస్తామన్న రూ.40 వేలలో కేవలం రూ.10 వేలు మాత్రమే ఇవ్వడం, వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం లేకపోవడం వల్ల రైతన్నలు సంతోషంగా పండుగ జరుపుకోలేకపోతున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారని అన్నారు.
వైద్యరంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి సంబంధించిన జీవోలను రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భోగి మంటల్లో దగ్ధం చేశారని వెల్లడించారు. నగరి నియోజకవర్గంలో అత్యధికంగా చేనేత కార్మికులు ఉన్నారని, వారికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని, పవర్‌లూమ్‌లకు కరెంట్ చార్జీలు తగ్గించాలని రోజా డిమాండ్ చేశారు.