జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసి కాల్చేసిన కేశినేని చిన్ని.. వీడియో ఇదిగో
- విజయవాడలో భోగి వేడుకలను వినూత్నంగా జరుపుకున్న కేశినేని చిన్ని
- కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన టీడీపీ నేతలు
- వైసీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శ
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భోగి పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భోగి వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాస్‌బుక్‌లను ఆయన భోగి మంటల్లో వేశారు. కేశినేని చిన్ని నిర్వహించిన భోగి కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకుని దోపిడీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బొమ్మలను తొలగించి, అసలు రాజముద్రతో పాస్‌బుక్‌లు జారీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్‌బుక్‌లను కాల్చేశామని చెప్పారు.
మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించిన జీవోలను కూడా వైసీపీ ప్రభుత్వమే తెచ్చిందని, ఇప్పుడు వైసీపీ నేతలే వాటిని భోగి మంటల్లో వేసి కాల్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత సర్కార్‌లో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజలు చాలా కష్టాలు పడ్డారని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టారని, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు.