శిల్పాశెట్టి భర్తకు షాకిచ్చిన కోర్టు.. సమన్ల జారీ

  • బిట్‌కాయిన్ స్కామ్ కేసులో రాజ్ కుంద్రాకు పీఎంఎల్ఏ కోర్టు సమన్లు
  • వ్యాపారవేత్త రాజేశ్ సతీజాకు కూడా సమన్ల జారీ
  • జనవరి 19న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు

బిట్‌కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను కోర్టు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్ కుంద్రాతో పాటు దుబాయ్‌లో ఉండే మరో వ్యాపారవేత్త రాజేశ్ సతీజాకు కూడా సమన్లు పంపారు. వీరిద్దరూ జనవరి 19న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ ఒక అదనపు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో రాజ్ కుంద్రా, రాజేశ్ సతీజాలను నిందితులుగా చేర్చారు. ఈ కేసు 'గైన్ బిట్‌కాయిన్' అనే పాంజీ స్కామ్‌తో ముడిపడి ఉంది. ఈ స్కామ్ ప్రధాన సూత్రధారి అమిత్ భరద్వాజ్. ఈడీ దర్యాప్తు ప్రకారం, అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్లు అందుకున్నాడు. యుక్రెయిన్ దేశంలో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయడానికని ఇవి అందుకున్నట్టు పేర్కొన్నారు.


కానీ, ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. అయినా సరే, ఆ 285 బిట్‌కాయిన్లు ఇప్పటికీ రాజ్ కుంద్రా వద్దనే ఉన్నాయని ఈడీ చెబుతోంది. ప్రస్తుతం వాటి విలువ 150 కోట్ల రూపాయలకు మించి ఉంటుందట. రాజ్ కుంద్రా తాను ఈ డీల్‌లో కేవలం మధ్యవర్తిగా మాత్రమే పని చేశానని చెబుతున్నాడు. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేదా ఆధారాలు అతను ఇవ్వలేదు. బదులుగా, "టర్మ్ షీట్" అనే ఒక ఒప్పంద పత్రం రాజ్ కుంద్రా - అమిత్ భరద్వాజ్ తండ్రి మహేందర్ భరద్వాజ్ మధ్య కుదిరిందని ఈడీ పేర్కొంది.


ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2018 నుంచి ఈడీ అనేక సార్లు అవకాశాలు ఇచ్చినా, ఆ బిట్‌కాయిన్లు ఎక్కడికి బదిలీ అయ్యాయో చూపించే వాలెట్ అడ్రెస్‌లు (డిజిటల్ పర్స్ వివరాలు) రాజ్ కుంద్రా ఇవ్వలేదు. అతను తన ఐఫోన్ డ్యామేజ్ అయిందని చెబుతున్నాడు. కానీ ఈడీ దీన్ని ఆధారాలు నాశనం చేసే ప్రయత్నంగా చూస్తోంది.



More Telugu News