Komatireddy Venkat Reddy: నిర్మాణ రంగం అంటే కేవలం కాంట్రాక్టు కాదు... రాష్ట్ర, దేశ నిర్మాణం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy Construction is Nation Building Not Just Contracts
నిర్మాణ రంగం అంటే కేవలం కాంట్రాక్టు కాదని, అది రాష్ట్ర, దేశ నిర్మాణమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ అండ్ జనరల్ కౌన్సిల్ మీటింగ్-2025-26 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

రోడ్లు, భవనాల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా విజన్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. అభివృద్ధికి నిర్మాణ రంగం కీలకమని అన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బిల్డర్లకు మంత్రి సూచించారు.

ప్రభుత్వాలు ప్రణాళికలు వేస్తాయి, బడ్జెట్ కేటాయిస్తాయి, ప్రాజెక్టులను ప్రకటిస్తాయని కానీ ఆ ప్రణాళికలకు ప్రాణం పోసేది మాత్రం బిల్డర్లేనని అన్నారు. బిల్డర్లు వేసే రోడ్లు ప్రజల ప్రయాణాన్ని సులభం చేస్తాయని, వంతెనలు దూరాన్ని తగ్గిస్తాయని అన్నారు. బిల్డర్లు కట్టే భవనాలు సేవలకు నిలయాలు అవుతాయని అన్నారు. అందుకే నిర్మాణ రంగం అంటే తన వరకు కేవలం కాంట్రాక్టు కాదని, దేశ, రాష్ట్ర నిర్మాణమని వ్యాఖ్యానించారు.

అభివృద్ధికి పునాది మౌలిక వసతులేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రోడ్లు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, కనెక్టివిటీ బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యేకంగా రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ భవిష్యత్తును మార్చే ప్రాజెక్టు అన్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ చుట్టూ ట్రాఫిక్ భారాన్ని తగ్గించడమే కాదని, చుట్టుపక్కల జిల్లాల్లో అభివృద్ధికి మార్గాలు వేస్తుందని అన్నారు. ఇది ఆర్థిక కారిడార్లకు దారి తీస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Komatireddy Venkat Reddy
Telangana
Construction Sector
Builders Association of India

More Telugu News