Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య

Chandrababu Naidu Visits Kakinada Fire Accident Site After 21 Deaths
  • గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
  • బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు
  • గతంలోనూ ఇక్కడ పేలుడు జరిగిందంటున్న స్థానికులు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 21కి పెరిగింది. ఈ ఘోర ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా కాకినాడ జిల్లాలోని ప్రమాద స్థలానికి హెలికాప్టర్ లో హుటాహుటిన బయలుదేరారు. ఘటనా స్థలిని పరిశీలించి, మృతుల కుటుంబాలను, బాధితులను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే హోంమంత్రి అనితను, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం, అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. "పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది" అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా భరోసా ఇచ్చారు.

వేట్లపాలెం-జి.మేడపాడు మధ్య పొలాల్లో ఆరు షెడ్లు వేసి అడబాల వీరబాబు అనే వ్యక్తి ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పేలుడు ధాటికి వేట్లపాలెం గ్రామంలోని పలు ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. 

కాగా, మధ్యాహ్న భోజనం కోసం కొంతమంది కార్మికులు బయటకు వెళ్లడంతో వారి ప్రాణాలు దక్కాయి. ఈ పరిశ్రమలో గతంలోనూ పేలుడు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Chandrababu Naidu
Kakinada fire accident
firecracker explosion
Andhra Pradesh accident
Vetlapalem
Samarlakota
fireworks factory
Adabala Veerababu
home minister Anitha
accident death toll

More Telugu News