V Hanumantha Rao: రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్ఠానం మీద విశ్వాసం ఉంది: రాజ్యసభ సీటుపై వి హనుమంతరావు

V Hanumantha Rao Confident in Party Leadership for Rajya Sabha Seat
  • తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలు
  • తన పనితీరు చూసి రేవంత్ రెడ్డి తప్పకుండా అవకాశం ఇవ్వాలన్న వీహెచ్
  • పార్టీలో పనిచేసే వారికి పదవులు దక్కుతాయని రేవంత్ రెడ్డి అన్నారన్న వీహెచ్
  • మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని వెల్లడి
తనకు రాజ్యసభ అవకాశం కల్పించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ అధిష్ఠానం మీద పూర్తి విశ్వాసం ఉందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు అన్నారు. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా, వాటి కోసం పలువురు రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీహెచ్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో తన పనితీరును చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీలో పని చేసిన వారికే పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వికారాబాద్‌లో జరిగిన డీసీసీ శిక్షణ తరగతుల్లో చెప్పారని గుర్తుచేశారు. ఈరోజు వరకు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నానని, అందుకే రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు.

పార్టీ కోసం తన పోరాట సామర్థ్యాలను చూసి అవకాశం ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అందరికంటే ఎక్కువగా తనమీద కేసులు నమోదయ్యాయని అన్నారు. అయినప్పటికీ తాను భయపడటం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిపాయిగా, గాంధీ కుటుంబానికి విధేయుడిగా పనిచేస్తున్నానని అన్నారు.

తనకు రాజ్యసభ అవకాశంపై పలువురు కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. తనకు ఫోన్లు చేసే వారికి ఒక విషయం చెప్పదలుచుకున్నానని, మన పని మనం చేసుకుంటూ వెళదామని అన్నారు. మిగిలినది అధిష్ఠానానికి వదిలివేద్దామని వ్యాఖ్యానించారు. జీవితంలో ఎవరికీ అన్యాయం చేయని తనకు న్యాయం జరుగుతుందని అన్నారు. తనకు రెండుసార్లు అన్యాయం జరిగినా పార్టీ జెండా మోస్తూనే ఉన్నానని తెలిపారు.

తనకు అవకాశం ఇవ్వాలని మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు తెలిపారు. అవకాశం ఇవ్వాలని సోనియా గాంధీకి కూడా లేఖ రాసినట్లు తెలిపారు. గడిచిన పదేళ్లలో తనకు ఎలాంటి పదవి లేదని అన్నారు. ఈసారి ఈ బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు జాతీయ రాజకీయాల్లో చాలా పరిచయాలు ఉన్నాయని తెలిపారు. తాను ఢిల్లీలో ఉంటే మిగతా పార్టీలు, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.
V Hanumantha Rao
Revanth Reddy
Rajya Sabha
Telangana Congress
Mallikarjun Kharge
Sonia Gandhi

More Telugu News