కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్... లంక ముందు 176 పరుగుల టార్గెట్

  • భారత్-శ్రీలంక ఐదో టీ20
  • తిరువనంతపురంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • టీమిండియాకు మొదట బ్యాటింగ్
శ్రీలంక మహిళల జట్టుతో తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక విజయం సాధించాలంటే 176 పరుగులు చేయాల్సి ఉంది.

టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్ కు ఏమంత ప్రాధాన్యత లేకుండా పోయింది. దాంతో, స్మృతి మంధాన, రేణుక ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్ వంటి స్టార్లకు విశ్రాంతినివ్వగా.. 17 ఏళ్ల తమిళనాడు యువ సంచలనం జి. కమలిని అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే షెఫాలీ వర్మ (5) ఔటవ్వగా, అరంగేట్ర క్రీడాకారిణి కమలిని 12 బంతుల్లో 12 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. మిగతా టాప్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 

అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం క్రీజులో పాతుకుపోయి స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. హర్మన్‌ప్రీత్ 43 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 68 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించింది.

మధ్యలో అమన్‌జోత్ కౌర్ (21) ఫర్వాలేదనిపించగా, చివర్లో అరుంధతి రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమరి అటపట్టు, కవిషా దిల్హారి, రష్మిక సేవంది తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ప్రస్తుతం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు, 1.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. క్రీజులో హాసిని పెరీరా (3), చమరి అటపట్టు (1) ఉన్నారు. శ్రీలంక గెలవాలంటే ఇంకా 171 పరుగులు చేయాల్సి ఉంది.


More Telugu News