లైంగిక వేధింపుల కేసు నుంచి హెచ్‌డీ రేవణ్ణ విముక్తి.. బెంగళూరు కోర్టు కీలక తీర్పు

  • రేవణ్ణపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసిన బెంగళూరు కోర్టు
  • ఫిర్యాదు చేయడంలో జరిగిన సుదీర్ఘ ఆలస్యమే కారణమన్న న్యాయమూర్తి
  • ఒక సెక్షన్‌ను ఇప్పటికే కొట్టేససిన హైకోర్టు 
  • తాజాగా మిగిలిన ఆరోపణల నుంచి విముక్తి కల్పించిన ట్రయల్ కోర్టు
మాజీ మంత్రి, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు లైంగిక వేధింపుల కేసులో భారీ ఊరట లభించింది. సోమవారం ఈ కేసును విచారించిన బెంగళూరు కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడైన రేవణ్ణపై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణలను కోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో న్యాయమూర్తి కె.ఎన్. శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంలో చాలా ఆలస్యం జరిగినట్లు కోర్టు గుర్తించింది. కేవలం ఈ ఒక్క కారణంతోనే రేవణ్ణపై ఉన్న ఆరోపణలను కొట్టివేయవచ్చని, ఆయనను నిర్దోషిగా ప్రకటించడానికి ఇది తగిన ఆధారమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. హసన్ జిల్లా హోలెనరసిపుర పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో గతంలో ఆయనపై సెక్షన్ 354, 354ఎ కింద అభియోగాలు నమోదయ్యాయి.

2024 ఏప్రిల్‌లో రేవణ్ణ ఇంట్లో పనిచేసే ఓ మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు అంతకుముందే సెక్షన్ 354ను కొట్టివేసింది. తాజాగా సెక్షన్ 354ఎ నుంచి కూడా బెంగళూరు కోర్టు విముక్తి కల్పించడంతో రేవణ్ణపై ఉన్న లైంగిక వేధింపుల కేసులు పూర్తిగా ముగిశాయి.

ఇదే వ్యవహారానికి సంబంధించి బాధితురాలిని కిడ్నాప్ చేశారన్న కేసులో గతేడాది మే నెలలో రేవణ్ణ అరెస్టై జ్యుడీషియల్ కస్టడీకి కూడా వెళ్లారు. తన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోల స్కాండల్‌లో బాధితురాలిగా ఉన్న మహిళను కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై సిట్ ఆయనను అప్పట్లో అరెస్టు చేసింది. తాజాగా లైంగిక వేధింపుల కేసులో ఆయనకు పూర్తి స్థాయిలో విముక్తి లభించింది.


More Telugu News