ప్రియుడు మాట్లాడడంలేదని ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం

  • అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘటన 
  • ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధిని
  • ఆత్మహత్యకు కారణాన్ని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న విద్యార్ధిని 
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని తన నివాసంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 

ఆమె ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడు లేకుండా జీవించలేనని, అయితే తాను మరొక యువకుడిని ప్రేమిస్తున్నానని భావించి, మొదట ప్రేమించిన వ్యక్తి తనతో మాట్లాడటం లేదని, తన తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసింది.

ఇదిలా ఉంటే, పుస్తకాలు కొనుగోలు చేయడానికి వెళ్ళిన సమయంలో తమ కుమార్తె ఒక యువకుడితో గొడవ పడటం చూశామని, ఆ సంఘటన తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. బాలిక మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సహచర విద్యార్థినులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 


More Telugu News