వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి.. మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు!

  • అరెస్టు భయంతో ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే
  • గత జూన్‌లో సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయించారన్న ఆరోపణలతో మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో అజ్ఞాతంలోకి
  • ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణకు కూడా వంశీతో పాటు ఆయన అనుచరులు డుమ్మా
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులోకి రాకుండా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. విజయవాడలోని మాచవరం పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న అనుమానంతోనే ఆయన పరారైనట్లు సమాచారం.

ఈ నెల 17న విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీని ప్రధాన నిందితుడిగా (ఏ1) పోలీసులు చేర్చారు. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయాలని తన అనుచరులను వంశీ రెచ్చగొట్టడంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారని నేరాభియోగం నమోదైంది. ఈ కేసులో వంశీతో పాటు యతీంద్ర రామకృష్ణ, కొమ్మా కోట్లు, ఓలుపల్లి రంగా, కాట్ర శేషు, ఎం.బాబు, మల్పూరి ప్రభుకాంత్, అనగాని రవి సహా పలువురు నిందితులుగా ఉన్నారు.

వారం రోజుల క్రితమే వంశీ నివాసానికి వెళ్లిన పోలీసులు సమన్లు ఇచ్చేందుకు ప్రయత్నించగా, ఆయన అక్కడ అందుబాటులో లేరు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినా, న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా సోమవారం విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో జరగాల్సిన సత్యవర్ధన్ కేసు విచారణకు కూడా వంశీ, ఆయన అనుచరుడు ఓలుపల్లి రంగా గైర్హాజరయ్యారు. ప్రస్తుతం వంశీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.


More Telugu News