బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడిపై గ్రామస్థులు దాడి.. చికిత్స పొందుతూ మృతి

  • రాజ్‌బరి జిల్లాలో దారుణం
  • సామ్రాట్‌పై దాడి చేసిన గ్రామస్థులు
  • చికిత్స పొందుతూ సామ్రాట్ మృతి
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్ర దాస్ దారుణ హత్య మరవకముందే, రాజ్‌బర్ జిల్లాల్లో మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

రాజ్‌బర్ జిల్లాలోని పంగ్షా సర్కిల్‌లో ఈ దారుణం జరిగింది. 29 ఏళ్ల అమృత్ మొండల్ అలియాస్ సామ్రాట్‌పై బుధవారం రాత్రి గ్రామస్థులు దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సామ్రాట్‌ అనుచరుడైన మహమ్మద్ సెలిమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పిస్టల్, షూటర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, 'సామ్రాట్ బహిన్' పేరిట డబ్బులు వసూలు చేస్తూ, ఒక క్రిమినల్ గ్యాంగ్‌ను నడుపుతున్నాడు. అతనిపై హత్యా నేరం సహా రెండు కేసులు ఉన్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిన తర్వాత సామ్రాట్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళాడని తెలిపారు.

ఇటీవలే గ్రామానికి చేరుకున్న సామ్రాట్, అదే గ్రామానికి చెందిన షాహిదుల్ ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడంతో కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారు. దీంతో గ్రామస్థులు సామ్రాట్‌ను చుట్టుముట్టి దాడి చేయగా, అతని గ్యాంగ్‌లోని ఇతర అనుచరులు పారిపోయారు. మహమ్మద్ ఒక్కడు పోలీసులకు చిక్కాడని వారు తెలిపారు.


More Telugu News