పోలీసులతో వైసీపీ నేత సీదిరి అప్పలరాజు వాగ్వాదం
- పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత
- పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
- జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో జోక్యం చేసుకున్న పోలీసులు
- 'కోటి సంతకాల' కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహణ
వివరాల్లోకి వెళితే.. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రీకాకుళంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మాజీ మంత్రి అప్పలరాజు పలాస నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ వజ్రపుకొత్తూరు మండలం బెండి గేట్ వద్దకు చేరుకోగానే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, మాజీ మంత్రి అప్పలరాజుకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్వరంతో మాట్లాడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని అప్పలరాజు ప్రశ్నించారు. ఈ వాగ్వాదంతో 'కోటి సంతకాల' కార్యక్రమం కొంతసేపు నిలిచిపోయింది.