మీరు నాకు చెప్పొద్దు.. నా అనుభవం 30 ఏళ్లు!: రాహుల్‌ పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం

  • లోక్‌సభలో అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం
  • మీ ఆదేశాలతో పార్లమెంట్ నడవదని రాహుల్‌కు స్పష్టం చేసిన షా
  • ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపణ
  • చట్టవిరుద్ధ వలసదారుల ఓట్లు పోతాయనేదే విపక్షాల భయమని విమర్శ
  • గతంలో కాంగ్రెస్ ప్రధానులూ ఇలాంటి సవరణలు చేశారని గుర్తు చేసిన షా
లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల సంస్కరణలపై జరుగుతున్న చర్చలో రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేయగా, అమిత్ షా ఘాటుగా స్పందించారు. "మీ ఆదేశాలతో పార్లమెంట్ నడవదు... సభా సమావేశాలను మీరు శాసించలేరు" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కల్పించుకుని, "ముందు నిన్న నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి" అని డిమాండ్ చేశారు. దీనిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. తనకు అసెంబ్లీ, పార్లమెంటులో 30 ఏళ్ల అనుభవం ఉందని, తాను ఎప్పుడు మాట్లాడాలో మీరు నిర్దేశించలేరని అన్నారు.

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను అమిత్ షా తిప్పికొట్టారు. విపక్షాలు 'ఓట్ల దొంగతనం' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఓటర్ల జాబితా నుంచి మరణించిన వారిని, విదేశీ పౌరులను తొలగించడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. "చట్టవిరుద్ధ వలసదారులు ఎన్నికల్లో పాల్గొనాలా?" అని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 1952 నుంచి 2004 వరకు అనేకసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఓటర్ల జాబితా సవరణలు జరిగాయని గుర్తుచేశారు. "జవహర్‌లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఎవరూ దీనిని వ్యతిరేకించలేదు. మరి ఇప్పుడెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు?" అని నిలదీశారు. నాలుగు నెలలుగా ఏకపక్ష అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తమకు మద్దతిచ్చే చట్టవిరుద్ధ వలసదారుల ఓట్లు తొలగిపోతాయనే భయంతోనే విపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అమిత్ షా విమర్శించారు.


More Telugu News