హైదరాబాద్ నగరానికి నాలుగో న్యూక్లియస్ గా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం: శ్రీధర్ బాబు

  • భారీగా ఉద్యోగాలు వచ్చేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్న మంత్రి
  • నెట్ జీరో కార్బన్ సిటీగా అభివృద్ధి చేస్తామని హామీ
  • త్వరలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్న మంత్రి
హైదరాబాద్ నగరానికి నాల్గవ న్యూక్లియస్ (కేంద్రకం)గా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని అన్నారు. దీనిని నెట్ జీరో కార్బన్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

సుమారు 13,500 ఎకరాల్లో గ్రీన్ సిటీగా దీనిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు అనుసంధానిస్తామని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. జోన్ల వారీగా విభజించి, ప్రతి జోన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.

ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ జోన్, ఎకో టూరిజం హబ్ ఉంటాయని మంత్రి వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన అన్నారు. త్వరలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని తెలిపారు. దాదాపు 400 ఎకరాల్లో డేటా సెంటర్ సిటీ నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News