Kadiyam Srihari: బీఆర్ఎస్‌లోనే ఉన్నాం కానీ నాయకత్వానికి దూరంగా ఉన్నాం: కడియం శ్రీహరి

Kadiyam Srihari Says He Remains in BRS But Distant From Leadership
  • స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ చట్టబద్ధం కాదన్న శ్రీహరి
  • సభలో ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్న శ్రీహరి
తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కానీ ఆ పార్టీ నాయకత్వానికి దూరంగా ఉన్నామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తనకు క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పును స్వాగతిస్తున్నానని అన్నారు. తమకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ చట్టబద్ధం కాదని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ ప్రజల ముందుకు వచ్చి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడలేదని తెలిపారు. శాసన సభలో మేం ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పటికీ, నాయకత్వానికి మాత్రమే దూరంగా ఉన్నట్లు తెలిపారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకున్నారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే ఎక్కువగా కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫిరాయింపుల విషయంలో గతంలో తప్పు చేశానని కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంతో పాటు కొందరిని మంత్రులుగా కూడా చేశారని తెలిపారు.

తాము పార్టీని ఫిరాయించింది నిజమే అయితే బీఆర్ఎస్ పార్టీ తమకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీ పరంగా కూడా తమపై ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. మా వేతనం నుంచి ప్రతి నెల రూ.5 వేలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి జమ అవుతున్నాయని వెల్లడించారు.
Kadiyam Srihari
BRS Party
Station Ghanpur
Telangana Politics
Party Defection
KCR
Speaker Ruling

More Telugu News