పాకిస్థాన్‌లో సంచలనం.. టాప్ సెర్చ్ అథ్లెట్‌గా భారత క్రికెటర్!

  • పాకిస్థాన్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ అథ్లెట్‌గా నిలిచిన అభిషేక్ శర్మ
  • ఆసియా కప్‌లో పాక్ బౌలర్లపై విధ్వంసకర బ్యాటింగే కారణం
  • ఈ జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం గమనార్హం
  • భారత్‌లోనూ టాప్-3 సెర్చ్ జాబితాలో నిలిచిన అభిషేక్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 2025 సంవత్సరానికి గాను విడుదల చేసిన 'ఇయర్ ఇన్ సెర్చ్' జాబితాలో ఒక ఆసక్తికర విషయం వెల్లడైంది. పాకిస్థాన్‌లో అత్యధిక మంది వెతికిన క్రీడాకారుల జాబితాలో ఒక భారత యువ క్రికెటర్ అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పాకిస్థాన్‌లో ఎంతో ఆదరణ ఉన్న విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లను కాదని, భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ పాక్‌లో టాప్ సెర్చ్ అథ్లెట్‌గా నిలవడం విశేషం.

ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై అభిషేక్ శర్మ ప్రదర్శించిన విధ్వంసకర బ్యాటింగే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 15 రోజుల వ్యవధిలో భారత్, పాకిస్థాన్ మూడుసార్లు తలపడగా, అభిషేక్ తన అద్భుతమైన ఆటతీరుతో పాక్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో పవర్‌ప్లేలో ఆయన చెలరేగి పరుగులు సాధించాడు. లీగ్ దశలో 13 బంతుల్లో 31 పరుగులు, సూపర్ ఫోర్ మ్యాచ్‌లో 39 బంతుల్లో 74 పరుగులతో అదరగొట్టాడు. ఫైనల్‌లో విఫలమైనా, అతని మునుప‌టి ప్రదర్శన పాక్‌లో అభిషేక్ పై సెర్చ్ పెరిగేలా చేసింది.

గూగుల్ విడుదల చేసిన ఈ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్లు హసన్ నవాజ్, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, సాహిబ్జాదా ఫర్హాన్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్‌లోనూ అభిషేక్ శర్మ టాప్-3లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యల తర్వాత అభిషేక్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఆసక్తికరంగా ఇరు దేశాల్లోనూ 'భారత్-పాకిస్థాన్' మ్యాచ్‌ల కంటే ఇతర సిరీస్‌ల గురించే ఎక్కువగా వెతికారు. భారత్‌లో 'ఇండియా వర్సెస్ ఇంగ్లండ్' మ్యాచ్ టాప్‌లో నిలవగా, పాకిస్థాన్‌లో 'పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా' మ్యాచ్ గురించి అత్యధికంగా సెర్చ్ చేశారు.


More Telugu News