భార్యను దారుణంగా నరికి చంపి, మృతదేహంతో సెల్ఫీ.. వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త!

  • కోయంబత్తూరు మహిళల హాస్టల్‌లో భార్య దారుణ హత్య
  • అనుమానంతో భర్తే కొడవలితో నరికి చంపిన వైనం
  • మృతదేహంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టిన నిందితుడు
  • ‘నమ్మక ద్రోహానికి శిక్ష మరణం’ అంటూ క్యాప్షన్ జోడింపు
  • నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
తమిళనాడులోని కోయంబత్తూరులో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త కిరాతకంగా నరికి చంపడమే కాకుండా, ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

తిరునల్వేలికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో శ్రీప్రియ భర్త నుంచి విడిగా ఉంటూ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అక్కడే ఓ మహిళల హాస్టల్‌లో నివాసం ఉంటోంది. అయితే, తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని బాలమురుగన్ అనుమానించాడు.

ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం భార్యతో మాట్లాడాలనే నెపంతో బట్టల్లో కొడవలిని దాచుకుని హాస్టల్‌కు వచ్చాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన బాలమురుగన్, తన వెంట తెచ్చుకున్న కొడవలితో శ్రీప్రియపై దాడి చేసి అక్కడికక్కడే నరికి చంపాడు.

అనంతరం, రక్తపు మడుగులో పడి ఉన్న భార్య మృతదేహం పక్కన కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. దానిని ‘నమ్మక ద్రోహానికి ప్రతిఫలం మరణం’ అనే క్యాప్షన్‌తో తన వాట్సాప్ స్టేటస్‌గా అప్‌లోడ్ చేశాడు. ఈ దాడితో భయభ్రాంతులకు గురైన హాస్టల్ వాసులు బయటకు పరుగులు తీశారు. నిందితుడు మాత్రం అక్కడే ఉండి, పోలీసులు వచ్చే వరకు వేచి చూశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రత్నపురి పోలీసులు బాలమురుగన్‌ను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


More Telugu News