రామాయణం నాటకంలో అశ్లీల ప్రదర్శనలు... తీవ్ర దుమారం!

  • ఒడిశాలో రామాయణం నాటకంలో అశ్లీల ప్రదర్శనలు
  • సీత పాత్రధారితో రావణుడి అసభ్య ప్రవర్తన
  • 50 గంటలకు పైగా సాగిన నాటకం
  • కళాకారులపై చర్యలు తీసుకోవాలని సాంస్కృతిక సంఘాల డిమాండ్
ఒడిశా రాష్ట్రంలో పవిత్ర రామాయణం నాటకం పేరుతో అశ్లీల ప్రదర్శనలు నిర్వహించడం తీవ్ర దుమారం రేపుతోంది. గంజాం జిల్లా మౌళాభంజ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శించిన ఈ నాటకంలో కళాకారులు హద్దులు మీరి ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కళా రంగ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలోని యాత్ర సందర్భంగా రెండు నాటక బృందాల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కళాకారులు అసభ్యతకు తెరలేపారు. రావణుడి వేషధారి.. సీత పాత్రధారిణిని అసభ్యంగా తాకడం, ముద్దులు పెట్టడం వంటి చేష్టలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా, నాటకం మధ్యలో ఐటమ్ డ్యాన్సులు, అర్ధనగ్న నృత్యాలు ప్రదర్శించారు. క్రేన్ల సాయంతో ప్రమాదకర విన్యాసాలు కూడా చేశారు. వాస్తవానికి ఈ నాటకాన్ని 24 గంటల పాటే ప్రదర్శించాలని నిర్ణయించినప్పటికీ, బృందాల మధ్య ఉన్న పోటీతత్వం కారణంగా ప్రదర్శన ఏకంగా 50 గంటలకు పైగా కొనసాగింది.

ఈ ఘటనపై ఆల్ ఇండియా థియేటర్ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షుడు రాజ్‌గోపాల్ పాఢి తీవ్రంగా స్పందించారు. పౌరాణిక నాటకాల్లో ఇలాంటి అశ్లీలతను ప్రదర్శించడం సాంస్కృతిక విలువలను దెబ్బతీయడమేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయని, వెంటనే ప్రభుత్వం విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు కళా సంస్థలు కోరుతున్నాయి.


More Telugu News