Pavitra Gowda: దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు జైల్లో ఇంటి భోజనం కట్!

Pavitra Gowda Home Food Cut Off in Jail
  • రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడకు ఎదురుదెబ్బ
  • జైల్లో ఇంటి భోజనం సౌకర్యాన్ని రద్దు చేసిన కర్ణాటక హైకోర్టు
  • కింది కోర్టు ఇచ్చిన అనుమతిని సవాలు చేసిన ప్రాసిక్యూషన్
  • చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేసిన న్యాయస్థానం
  • ఖైదీలకు ప్రత్యేక సౌకర్యాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావించిన ధర్మాసనం
కన్నడ నటుడు దర్శన్ భాగస్వామి, రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలైన పవిత్ర గౌడకు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జైల్లో ఆమెకు ఇంటి భోజనం అందించేందుకు కింది కోర్టు ఇచ్చిన అనుమతిని హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. పవిత్రతో పాటు మరో ఇద్దరు నిందితులు లక్ష్మణ్, నాగరాజ్‌లకు కూడా ఈ సౌకర్యాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. గతంలో కింది కోర్టు వారానికి ఒకసారి ఇంటి భోజనం తెప్పించుకునేందుకు పవిత్ర గౌడకు అనుమతి ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ప్రాసిక్యూషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. జైల్లోని నిందితులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. చట్టం ముందు అందరూ సమానులేనని, హోదా, పలుకుబడితో సంబంధం లేకుండా నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని స్పష్టం చేసింది.

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి 2024 జూన్ 11న కిడ్నాప్‌కు గురై హత్యకు గురైన విషయం తెలిసిందే. పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపినందుకే ఈ దారుణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో ప్రస్తుతం వీరంతా జైల్లో ఉన్నారు. ఈ కేసులో నిందితులపై ఇప్పటికే స్థానిక కోర్టు హ‌త్య‌, కిడ్నాప్‌, కుట్ర వంటి అభియోగాలను నమోదు చేసింది. అయితే, నిందితులందరూ తమపై మోపిన అభియోగాలను ఖండించారు.
Pavitra Gowda
Darshan
Renukaswamy murder case
Karnataka High Court
Kannada actor Darshan
jail food
crime news
murder investigation
Karnataka police
court order

More Telugu News