Nara Lokesh: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి... ఏపీలో మాత్రం స్థిరమైన ప్రగతి: దావోస్‌లో మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Stable Progress in AP Amidst Global Uncertainty at Davos
  • దావోస్ వేదికగా ఏపీ ఇన్నోవేషన్ విజన్
  • మంత్రి నారా లోకేశ్ కీలక ప్రసంగం
  • ఆవిష్కరణ-పరిశ్రమ మధ్య అంతరాలు తొలగిస్తామని వెల్లడి
  • రతన్ టాటా హబ్‌తో స్టార్టప్‌లకు ఊతం
  • దావోస్‌లో ఏపీ ప్రగతిని వివరించిన లోకేశ్
ఆవిష్కరణకు, పరిశ్రమకు మధ్య ఉన్న అంతరాలను తొలగించి, దీర్ఘకాలిక రాబడులు ఇచ్చే విశ్వసనీయమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్నామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో భాగంగా, "ధృడమైన ఆవిష్కరణల కోసం పెట్టుబడులను బలోపేతం చేయడంలో మనం ఎక్కడ?" అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు పెట్టుబడులు ఎందుకు కొరవడుతున్నాయి, ఈ కారణంగా ఇన్నోవేషన్ ఎలా నిలిచిపోతోంది, ఈ సమస్యను అధిగమించడానికి అంతర్జాతీయంగా ఎలా దృష్టిసారించాలనే అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రపంచ పెట్టుబడులపై ఉద్రిక్తతల ప్రభావం

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక విభజన, పర్యావరణ సంక్షోభాలు ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD) నివేదికను ఉటంకిస్తూ, 2024లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు భారీగా తగ్గాయని గుర్తుచేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం నిలకడగా ముందుకెళుతోందని, అందుకు తమ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని స్పష్టం చేశారు.

పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల్లో 31 శాతం, నీరు-స్వచ్ఛత రంగాల్లో 30 శాతం, వ్యవసాయ-ఆహార రంగాల్లో 19 శాతం చొప్పున పెట్టుబడులు తగ్గడం ఆందోళనకరమని అన్నారు. లాభాలపైనే దృష్టి పెట్టే ప్రైవేట్ సంస్థలు ప్రాథమిక పరిశోధనలపై తక్కువగా ఖర్చు చేస్తాయని, ఈ అంతరాన్ని ప్రభుత్వాలే పూరించాలని సూచించారు. ప్రభుత్వాలు గ్రాంట్లు, ఆర్ అండ్ డి సబ్సిడీలు, వ్యూహాత్మక రంగాల్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆవిష్కరణలకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

స్వల్పకాలిక ప్రయోజనాలు కాదు.. దీర్ఘకాలిక నమ్మకమే ముఖ్యం

పెట్టుబడులను ఆకర్షించడం అంటే కేవలం కొన్ని సంస్థలను తీసుకురావడం కాదని, ఆవిష్కరణలకు అవసరమైన స్థిరమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడమని లోకేశ్ అన్నారు. "భారత్‌లో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మేము, స్వల్పకాలిక ప్రోత్సాహకాల కన్నా నమ్మకం, సామర్థ్యం, దీర్ఘకాలిక నిబద్ధత ఉంటేనే ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తున్నాం" అని ఆయన తెలిపారు. 

ఈ దిశగా తమ ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టిందని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లకు అండగా నిలుస్తోందని వివరించారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్, సిస్కో, ఎల్&టీ టెక్నాలజీ సర్వీసెస్ వంటి దిగ్గజాలతో కలిసి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు, పరిశోధన-అభివృద్ధి (R&D)పై నేరుగా పెట్టుబడులు పెడుతున్నామని, దీనివల్ల వినూత్న ఆలోచనలు వేగంగా స్టార్టప్‌లుగా మారుతున్నాయని పేర్కొన్నారు.

ప్రతిభ, పాలనే మా బలం

కేవలం పరిశ్రమలపైనే కాకుండా, ప్రతిభపైనా పెట్టుబడులు పెడుతున్నామని లోకేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక ప్రతిభావంతులు ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు చూపగలరన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇందుకోసం పారిశ్రామిక క్లస్టర్లలో ఆర్ అండ్ డిని ఏకీకృతం చేస్తూ, ప్రపంచ భాగస్వామ్యులకు విశ్వసనీయమైన వేదికగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 

అనిశ్చితి లేని పారదర్శక పాలసీలు, డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఎస్క్రో మెకానిజం వంటివి స్థిరమైన ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయని వివరించారు. ఈ విధానాల వల్లే కేవలం 18 నెలల వ్యవధిలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ద్వారా రూ.8.75 లక్షల కోట్ల (97 బిలియన్ డాలర్లు) విలువైన 211 ప్రాజెక్టులను ఆమోదించామని, వీటి ద్వారా 8.36 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.

త్రిముఖ వ్యూహంతో ముందుకు

ఏపీ ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని లోకేశ్ వివరించారు. ఇందులో భాగంగా వివిధ రంగాలకు సంబంధించిన క్లస్టర్ల వారీగా అభివృద్ధి, విశ్వవిద్యాలయాలు-నైపుణ్య సంస్థలతో పరిశ్రమలను అనుసంధానించడం, దీర్ఘకాలిక విలువను సృష్టించే విధానాలను రూపొందించడంపై దృష్టి సారించామన్నారు.

ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేసే 'ట్రిపుల్ హెలిక్స్ మోడల్' ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. క్లీన్ ఎనర్జీ రంగంలో 2047 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి, 167 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ, దేశంలోనే తొలి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటి భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.
Nara Lokesh
Andhra Pradesh
Davos
World Economic Forum
WEF
Investments
Innovation Ecosystem
Ratan Tata Innovation Hub
AP SIPB
Clean Energy

More Telugu News