Revanth Reddy: ఫ్యూచర్ సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపిన యూఏఈ

Revanth Reddy UAE to Partner with Telangana for Future City
  • రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందాన్ని కలిసిన యూఏఈ మంత్రి
  • ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న మంత్రి
  • తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాన్ని వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్ బిన్ తౌక్ ఆల్ మర్రీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందాన్ని కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి మర్రీ మాట్లాడుతూ, తెలంగాణతో కలిసి పనిచేయడానికి సంతోషంగా ఉన్నామని అన్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి రెండు ప్రభుత్వాలు అధికారులతో ఒక ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతినిధి బృందం భారత్ ఫ్యూచర్ సిటీలో సహకారానికి గల అవకాశాలపై చర్చించింది.

తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ను యూఏఈ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలోనే తొలి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి అవకాశాలపై చర్చించారు.

విద్య, ఆరోగ్యం, ఏఐ, పరిశ్రమలు, నివాసాలు, వినోద రంగాలకు ప్రత్యేక జోన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మారుబేని, సెమ్‌కార్ప్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం చేతులు కలిపాయని అన్నారు. ఫ్యూచర్ సిటీలో జూను స్థాపించడం కోసం రిలయన్స్ గ్రూప్ వంతారాతో అవగాహన ఒప్పందం కుదిరిందని ముఖ్యమంత్రి వివరించారు.
Revanth Reddy
Telangana
UAE
Bharat Future City
World Economic Forum
Davos
Telangana Rising

More Telugu News