తుఫాను ముందస్తు చర్యలు: ఆరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

  • ఎల్లుండి రాత్రికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం
  • తీర ప్రాంత జిల్లాల్లో నష్టం నివారించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్
  • ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ నుంచి ఆరు బృందాల తరలింపు  
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ మంగళవారం రాత్రికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంత జిల్లాల్లో సాధ్యమైన నష్టం నివారించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బలగాలను మోహరించింది.

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని ఎన్డీఆర్‌ఎఫ్‌ పదో బెటాలియన్‌ నుండి మొత్తం ఆరు బృందాలు నిన్న రాత్రి తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. ప్రతి బృందంలో 30 మంది శిక్షణ పొందిన సిబ్బంది ఉండగా, వీరిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు పంపించారు.

తుఫాన్‌ సమయంలో ఎదురయ్యే వర్షాలు, గాలివానలు, వరదల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యల కోసం ఈ బృందాలను ముందస్తుగా పంపించారు. ఈ సందర్భంగా సిబ్బందికి బెటాలియన్ కమాండెంట్ ప్రసన్నకుమార్ పలు సూచనలు చేశారు. విపత్తు పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రమాద ప్రాంతాలపై నిఘా ఉంచడం, తుపాన్‌ తర్వాత రక్షణ–పునరావాస చర్యలు చేపట్టడంలో ఈ బృందాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఇక రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే జిల్లాల అధికారులతో సమన్వయం ఏర్పరచి, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు, గాలివానలు తీవ్రంగా ఉండే అవకాశముందని, అవసరమైతే తక్షణం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇచ్చింది. 


More Telugu News