మంత్రులు స్పందిస్తున్నారు కదా అని నేతలు మౌనంగా ఉంటే ఎలా?: సీఎం చంద్రబాబు

  • జగన్ కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు
  • ప్రభుత్వంపై జరుగుతున్న విష ప్రచారాన్ని అడ్డుకోవాలని సూచన
  • మంత్రులతో పాటు పార్టీ నేతలు కూడా స్పందించాలని స్పష్టం
  • జోగి రమేశ్ పై చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న సీఎం
  • విశాఖకు గూగుల్ రావడంపై చంద్రబాబుకు నేతల అభినందనలు
కూటమి ప్రభుత్వంపై జగన్‌ చేస్తున్న విష ప్రచారాన్ని పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. మంత్రులు స్పందిస్తున్నారు కదా అని పార్టీ నేతలు మిన్నకుండిపోతే సరిపోదని, ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జగన్ చేస్తున్న అసత్య ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండించాలని చంద్రబాబు సూచించారు. "ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవడంలో మంత్రులతో పాటు పార్టీ నేతలు కూడా సమాంతరంగా పనిచేయాలి. జగన్ చేస్తున్న అబద్ధాలను మీడియా ముఖంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది" అని ఆయన నేతలకు ఉద్బోధించారు.

ఇదే సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేశ్ పై నమోదైన మద్యం కుంభకోణం కేసు ప్రస్తావనకు వచ్చింది. ఆయనను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కొందరు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, మద్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టత ఇచ్చారు. దర్యాప్తులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టును తీసుకువచ్చినందుకు వారు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వర్ల రామయ్య సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


More Telugu News