ఆసియా కప్ సంబరాల ఐడియా ఎవరిదంటే..!

  • ఫైనల్లో గెలిచాక ట్రోఫీ లేకుండానే టీమిండియా సంబరాలు
  • ట్రోఫీ కోసం చాలాసేపు వేచి ఉన్నామన్న వరుణ్‌ చక్రవర్తి
  • చివరకు అర్ష్ దీప్ ఇచ్చిన ఐడియాతో సెలబ్రేట్ చేసుకున్నట్లు వెల్లడి
ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ ను ఓడించి టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఏసీసీ చీఫ్‌ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నఖ్వీ.. ట్రోఫీ వెంటతీసుకుని హోటల్ గదికి వెళ్లిపోయారు.

అప్పటి వరకు బహుమతి ప్రదానం కోసం సిద్ధం చేసిన వేదికకు సమీపంలోనే వేచి ఉన్న టీమిండియా సభ్యులు.. ట్రోఫీని తిరిగి తీసుకువస్తారని చాలాసేపు ఎదురుచూశారు. ఆ తర్వాత ట్రోఫీ లేకుండానే సంబరాలు జరుపుకున్నారు. ఈ వినూత్న సంబరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంబరాలకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని టీమిండియా క్రికెటర్ వరుణ్ చక్రవర్తి తాజాగా మీడియాతో పంచుకున్నాడు.

ట్రోఫీని ఏసీసీ చీఫ్ నఖ్వీ తీసుకెళ్లిపోవడంతో తాము చాలాసేపు ఎదురుచూశామని వరుణ్ చెప్పాడు. అనంతరం అర్ష్ దీప్ సింగ్‌ ఇచ్చిన ఐడియాతో కప్‌ అందుకొన్నట్లు నటిస్తూ ఫొటోలకు, వీడియోలకు ఫోజులిచ్చామని తెలిపాడు. ‘‘ట్రోఫీ లేకుండా సంబరాలు చేసుకోవడం చాలా కొత్తగా ఉంది. మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో అద్భుతమైన వాతావరణం ఉంది. కప్‌ ఉన్నట్లే సంబరాలు చేసుకున్నాం’’ అని సంజు శాంసన్‌ కూడా వెల్లడించాడు.


More Telugu News