చలాన్ల విషయంలో కఠినంగా మారనున్న రూల్స్.. నిర్లక్ష్యం చేస్తే లైసెన్స్ రద్దు

  • కేంద్ర రవాణా శాఖ ముసాయిదా ప్రకటన విడుదల
  • చలాన్లు కట్టకుండా వదిలేస్తే లైసెన్స్ రద్దవుతుంది జాగ్రత్త
  • 45 రోజులు దాటితే వెహికల్ సీజ్
ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనం నడుపుతున్నారా.. మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడినా పట్టించుకోవడంలేదా.. అయితే, మీరు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది. పెండింగ్ చలాన్లు ఎన్ని ఉన్నా పోలీసులు ఆపినప్పుడు కడదాంలే అనుకుంటే ఇకపై కుదరదు. చలాన్ పడిన 45 రోజుల్లోగా చెల్లించలేదంటే అంతే.. ఐదు చలాన్లకు మించి పెండింగ్ లో ఉంటే లైసెన్స్ రద్దయినట్లు మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యువల్‌ కాకపోవచ్చు కూడా.. మీ వాహనాన్ని ట్రాఫిక్ సిబ్బంది సీజ్ చేసే అవకాశం ఉంది. పెండింగ్ చలాన్ల విషయంలో కేంద్రం కఠిన చర్యలను ప్రతిపాదిస్తూ సెంట్రల్‌ మోటారు వెహికిల్స్‌ రూల్స్‌-1989లో కేంద్ర రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ రూల్స్‌ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది.

చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్‌ చేయడం వంటి అంశాలను డిజిటల్‌ మానిటరింగ్, ఆటోమేషన్‌ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడురోజుల్లోగా ఎలక్ట్రానిక్‌ రూపంలో నోటీసు జారీ చేయాలని, ఫిజికల్‌ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది. 

కొత్త రూల్స్ ఇవే..
  • మోటారు వెహికిల్‌ యాక్టు కింద ఒక వాహనంపై 5 లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేయొచ్చు. 
  • చలాన్ చెల్లించడానికి ప్రస్తుతం ఉన్న 90 రోజుల గడువు 45 రోజులకు తగ్గింపు. 
  • ఈ గడువు దాటితే సదరు వాహనాన్ని అమ్మడం కుదరదు. డ్రైవింగ్ లైసెన్సులో మార్పులకు కానీ రెన్యువల్ కు కానీ వీలుండదు.
  • చలాన్‌ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.
  • ప్రస్తుత నిబంధనల ప్రకారం.. వాహనం ఎవరు నడిపినా రూల్స్ అతిక్రమిస్తే వాహన యజమాని పేరుపైనే చలాన్ జారీ అవుతోంది. ఇకపై, వాహనం నడిపిన వ్యక్తిని బాధ్యుడిగా చేయనున్నారు.


More Telugu News